జబర్దస్త్ షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు..!

వాస్తవం సినిమా: మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఎప్పటినుండో షోలో న్యాయనిర్ణేతగా ఉంటూ పార్టిసిపెంట్స్ ని ఎంకరేజ్ చేస్తూ షో లో అదరగొట్టే పార్టిసిపెంట్స్ కి ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చే విధంగా వ్యవహరిస్తూ మార్గదర్శకంగా ఉండే నాగబాబు జబర్దస్త్ షో నుండి బయటకు రావడంతో ఈ వార్త సోషల్ మీడియాలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. నాగబాబు షో నుండి బయటకు వచ్చాక రకరకాల వార్తలు, రూమర్స్ ఎక్కువైన నేపథ్యంలో…తాజాగా నాగబాబు షో నుండి ఎందుకు బయటకు వచ్చేశారు అన్న దాని విషయం గురించి తన యూట్యూబ్ ఛానల్ లో వివరణ ఇవ్వటం జరిగింది. నాగబాబు ఏమన్నారంటే…తనకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మాట వాస్తవమేనని, దాదాపుగా ఏడేళ్లుగా ఆ షోతో తనకు ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. అయితే ఆ షో నిర్వాహకులైన మల్లెమాల సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని, అయితే ఆ సంస్థలో కొందరి వల్లనే మొత్తం జబర్దస్త్ షో కు ప్రస్తుతం నష్టం చేకూరే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. షోలో పార్టిసిపెంట్స్ కు ఏమైనా ప్రమాదం, లేదా అనారోగ్యం వంటి ఘటనలు జరిగితే మనకెందుకులే అనేలా వ్యవహరించేవారని, షోలో పని చేస్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్ ఇస్తున్నాం, అది సరిపోదా అనేలా ప్రవర్తించే వారి భావన సరైనది కాదని అన్నారు. ఇప్పటికే పలుమార్లు కొందరు పార్టిసిపెంట్స్ కు జరిగిన నష్టాలపై కనీసం ఆ సంస్థలోని వారు ఇప్పటికీ కూడా ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్న తీరు తనకు నచ్చలేదని అన్నారు. ఇందు మూలంగానే షో నుండి బయటకు వచ్చినట్లు నాగబాబు తెలిపారు. దీంతో నాగబాబు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.