లండన్‌ బ్రిడ్జ్ మీద ఉగ్రదాడి

వాస్తవం ప్రతినిధి: బ్రిటన్‌ రాజధాని లండన్‌ నగరం నడిబొడ్డున థేమ్స్‌ నదిపై గల ప్రసిద్ధ వంతెనకు సమీపాన దారుణం చోటు చేసుకున్నది. ఓ ఆగంతకుడు శుక్రవారం మధ్యాహ్నం వంతెన వద్ద ఉన్న వ్యక్తులపై కత్తిపోట్లకు పాల్పడ్డాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేయడంతో పాటు లండన్‌ బ్రిడ్జిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.ఘటనా స్థలంలో చనిపోయిన వ్యక్తి దగ్గర ప్రమాదకరమైన పేలుడు పరికరాలు ఉన్నయని పోలీసులు వెల్లడించారు. బ్రిడ్జ్ వద్దకు చేరుకున్న దుండగుడు దాడికి యత్నించిన పలువరిని గాయపరిచాడు. దుండగులు దాడికి యత్నించిన వీడియోలు అక్కడి సీసీఫూటేజిలో ప్రసారమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పోలీసులు బ్రిడ్జ్ ను చుట్టుముట్టారు.

ఈ వంతెనతోపాటు సమీపంలోని హోటళ్లు, సంస్థల వద్ద ఉన్న సాధారణ వ్యక్తులను ఖాళీ చేయించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మూసివేశారు. ఇది చాలా పెద్ద ఘటన అని లండన్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. ఇది ఉగ్రదాడేనని పోలీసులు ప్రకటించారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఉస్మాన్ ఖాన్ గా గుర్తించారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పందిస్తూ ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. హోంమంత్రి ప్రీతి పటేల్‌ మాట్లాడుతూ ఈ ఘటన ఆందోళనకరమని, గాయపడిన వారంతా కోలుకోవాలని భావిస్తున్నానని ట్వీట్‌ చేశారు.