మళ్ళీ అమెరికాలో కాల్పులు…భారతీయ విద్యార్థి మృతి

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.. గన్ కల్చర్ ను విచక్షణా రహితంగా వినియోగిస్తున్న దుండగులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతకుంటున్నారు. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తోంది. బయటకు వెళ్లిన వారు ప్రజలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారన్న నమ్మకం లేదు. తాజాగా ఎంఎస్ చేయడంకోసం అమెరికా వెళ్లిన మైసూర్ యువకుడు గుర్తు తెలియని వ్యక్తి చేసిన కాల్పుల్లో మృతి చెందాడు. మైసూరులోని కువెంపు నగర్‌కు చెందిన అభిషేక్‌ సుధేశ్‌ భట్‌ (25) ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఏడాదిన్నర క్రితం ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లాడు. శాన్‌ బెర్నార్డియాలోని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేస్తూ ఓ హోటల్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హోటల్‌కు వచ్చిన ఓ దుండగుడు అభిషేక్‌తో గొడవపడి, తుపాకితో కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్ర గాయాలతో అభిషేక్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. అభిషేక్ మృతి వార్తను మైసూర్‌లోని అతని తల్లిదండ్రులకు యూనివర్సిటికి చెందిన అధికారులు ఫోన్ చేసి తెలిపారు. అభిషేక్ తండ్రి సుదేష్ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాను కలిసి కొడుకు మృతదేహాన్ని వీలైనంత తొందరగా భారత్‌కి రప్పించాలని కోరారు.