పొట్టలో 7కిలోల ప్లాస్టిక్..థాయ్‌లాండ్‌లో దారుణం!

వాస్తవం ప్రతినిధి: ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి హాని కలిగిస్తుందని నెత్తీ నోరు మొత్తుకున్నా మానవుని జీవితంలో మమేకమైపోయిన ప్లాస్టిక్ లేనిదే రోజు గడవడం కష్టమైపోయింది. ప్లాస్టిక్‌పై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎన్ని అవగాహనలు తీసుకొస్తున్న, ప్లాస్టిక్‌ని బ్యాన్‌ చేసిన కూడా వాటి వినియోగం మాత్రం ఆగడం లేదు. మన అవసరాలను చాలా తేలికగా తీరుస్తున్న ప్లాస్టిక్ కవర్లు, మనకే కాకుండా నోరులేని మూగ జీవులకు హాని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా చెంగు చెంగున అడవిలో తిరిగే జింకలు ఆకులు, అలములు తిని బతుకుతుంటే, వాటి మానాన వాటిని బతకనివ్వకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు అడవులను కూడా నాశనం చేస్తూ అడవుల్లో సంచరిస్తున్న మూగ జీవుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.

తాజాగా బ్యాంకాక్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఓ మూగ జీవిని బలితీసుకున్నాయి. థాయ్‌లాండ్‌లో ఉత్తర నాన్‌ ప్రావిన్స్‌లోని ఖున్‌ సతాన్‌ నేషనల్‌ పార్కులో ఈ దారుణం చోటుఛేసుకుంది. చెంగు చెంగున ఎగిరే జింక సడెన్‌గా ప్రాణాలు కోల్పోయేసరికి అటవీ శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. జింకను పరీక్ష చేసి దాని కడుపులో 7 కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తర నాన్‌ ప్రావిన్స్‌లోని ఖున్‌ సతాన్‌ నేషనల్‌ పార్కులో జింక మృతదేహంలో 7 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను వెలికితీశారు. జింక పొట్టలో నుంచి తీసిన వ్యర్ధాల్లో కాఫీ, నూడుల్‌ ప్యాక్‌లు, ప్లాస్టిక్‌ బ్యాగులు, రబ్బర్‌ గ్లౌవ్స్‌, హ్యాండ్‌కర్చీఫ్‌, ప్లాస్టిక్‌ రోప్‌తోపాటు ఇతర ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడ్డాయి. జింక పొట్టలో నుంచి బయటకు తీసిన ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో డ్రాయర్‌ కూడా ఉండటం గమనార్హం. 135 సెంటీమీటర్ల ఎత్తు, 230 సెంటీమీటర్ల పొడవున్న మగజింక పదేళ్ల వయస్సున్నట్లు గుర్తించారు. అన్నేసి ప్లాస్టిక్ వ్యర్థాలు జింక పొట్టలో అరగకపోవడం వల్లే చనిపోయిందని అన్నారు అటవీ శాఖ అధికారులు.