అమెరికాలో దారుణం..హైద‌రాబాదీ యువ‌తి రేప్‌, హ‌త్య‌

వాస్తవం ప్రతినిధి: 19 సంవత్సరాల ఇండో-అమెరికన్‌ విద్యార్ధినిని దుండగుడు లైంగికంగా వేధించి హత్య చేసిన ఘటన అమెరికాలోని తెలుగు రాష్ట్రాల వారిని కలవరపాటుకు గురిచేసింది. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్ జార్జ్‌ను ఆగంత‌కుడు అత్యాచారం చేసి.. ఆ త‌ర్వాత‌ హ‌త్య చేసిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. న‌వంబ‌ర్ 23వ తేదీన ఈ మ‌ర్డ‌ర్ జ‌రిగింది. రూత్ జార్జ్ మృత‌దేహాన్ని యూనివ‌ర్సిటీలో ఉన్న గ్యారేజీలో గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగుడు డొనాల్డ్‌ తుర్మన్‌ (26)ను చికాగో మెట్రో స్టేషన్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. నిందితుడికి యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేదని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. నిందితుడిపై హత్య, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

న‌వంబ‌ర్ 22వ తేదీ నుంచి రూత్ జార్జ్ ఆచూకీ లేకుండాపోయింది. దీంతో ఆ యువ‌తి పేరెంట్స్‌ 23వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె వ‌ద్ద ఉన్న ఫోన్‌.. హాల్‌స్టెడ్ స్ట్రీట్ పార్కింగ్ గ్యారేజీ వ‌ద్ద పింగ్ అయిన‌ట్లు గుర్తించారు. అక్క‌డ‌కు వెళ్లిన పోలీసులు స్వంత కారులోని బ్యాక్‌సీటులో రూత్ శ‌వ‌మై ఉన్న‌ట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడు డొనాల్డ్‌ దుశ్చర్యను పసిగట్టి చికాగో మెట్రో స్టేషన్‌ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. హెల్త్‌ ప్రొఫెఫషనల్‌గా మారి ఎందరికో సాయం చేయాలని కలలు కన్న యువతి విషాదాంతం తమను దిగ్ర్భాంతికి గురిచేసిందని, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని వర్సిటీ చాన్స్‌లర్‌ మైఖేల్‌ డీ అమిరిడిస్‌ పేర్కొన్నారు.