తడి బంతులతో ప్రాక్టీస్‌ చేసిన బంగ్లా జట్టు

వాస్తవం ప్రతినిధి: అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగేండ్ల క్రితమే తొలి డే/నైట్‌ టెస్టు జరిగినా.. భారత్‌ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గులాబీ బంతితో ఆడలేదు. ఎట్టకేలకు ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో భారత్‌ తొలి డే/నైట్‌ టెస్టు ఆడుతుంది. ఇరు జట్లకు ఇదే తొలి డే/నైట్‌ టెస్టు కావడం విశేషం. ఈ చారిత్రక డే/నైట్‌ టెస్టు కోసం భారత్‌, బంగ్లా జట్ల ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

తొలి టెస్టు మూడు రోజుల్లోనే పూర్తి ముగిసినా.. భారత్‌, బంగ్లా జట్లు ఇండోర్‌లోనే ఉండి హోల్కర్ స్టేడియం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్‌ చేశాయి. అయితే ఈ డే/నైట్‌ టెస్టు కోసం బంగ్లా ఆటగాళ్లు నీటిలో ముంచిన బంతితో ప్రాక్టీస్ చేశారు. సోమవారం బంగ్లా ఆటగాళ్లు సుమారు మూడు గంటల పాటు ప్రాక్టీస్‌ చేశారు. డేనైట్‌ టెస్టుపై మంచు ప్రభావం ఉన్నందున ఆ పరిస్థితులకు అలవాటు పడేలా బంగ్లా ఆటగాళ్లు తడి బంతులతో ప్రాక్టీస్‌ చేసారు.

ప్రాక్టీస్ సందర్భంగా బంగ్లా స్పిన్నర్‌ హసన్‌ మాట్లాడుతూ… ‘మూడు రోజులు కూడా మా పేస్‌ బౌలర్లు బంతిని తడిగా చేసి ప్రాక్టీస్‌ చేస్తారు. దీంతో పింక్‌ బాల్‌ టెస్టుకు అలవాటు పడతాం. బంతి తడిగా మారితే జారుతుంది, అయినా స్పిన్నర్లకు బౌన్స్‌, టర్న్‌ లభిస్తుంది’ అని తెలిపాడు.