ఇండోర్ లో భారత్ జట్టు ఘన విజయం

వాస్తవం ప్రతినిధి: ఇండోర్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే 130 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టుపై భారత్ జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో ముష్పికుర్ రహీమ్ 43, మోమినుల్ 37, లిటన్ దాస్ 21 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్లు మహ్మద్ షమీ 3, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ లు రెండు చొప్పున వికెట్లను తీశారు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 114 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 493 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు మయాంక్ అగర్వాల్ 243, అజింక్య రహానే 86, రవీంద్ర జడేజా 60, ఛటేశ్వర్ పుజారా 54 పరుగులు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు 69.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో ముష్ఫికర్ రహీమ్ 64 పరుగులు, మెహిదీ హసన్ 38, లిటన్ దాస్ 35 పరుగులు చేశారు. దీంతో భారత్ జట్టు ఒక ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.