ఇరాక్‌లో నిరసనలు ఉధృతం!

వాస్తవం ప్రతినిధి: ఇరాక్‌లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఇరాక్‌లోని దక్షిణ నగరాలన్నీ గతనెల1 నుంచి నిరసనలతో అట్టడుకుతున్నాయి. అవినీతిని నిర్మూలించాలని, నిరుద్యోగ సమస్యను రూపుమాపాలని, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాఢిలో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకారులు కదం తొక్కారు. నిరసనకారుల డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కొరవడటంతో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఇరాక్‌లో చెలరేగిన నిరసనల్లో 300 మంది మృతిచెందారు. 750 మంది గాయపడ్డారు. ఇరాక్‌ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. సమస్యాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆర్మీని ఆదేశించింది. నిరసన కార్యక్రమాలు కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రతిపక్ష నేతలే నిరసనలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించింది.

పౌర మరణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు ఇరాక్‌ ప్రధాని ఆదెల్‌ అబ్దుల్‌ మహ్దీ తెలిపారు. నిరసనకారులు ఆందోళన విరమించాలని ఆయన అభ్యర్థించారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. రానున్న రెండేండ్లలో నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.