టీఎస్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా లండన్‌లో ఐక్యవేదిక అఖిలపక్ష సమావేశం

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా చేపడుతున్న సమ్మె ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు విదేశాలకు కూడా పాకింది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసి సమ్మెకు మద్దతుగా ప్రవాస భారతీయులు నిలిచారు. లండన్ లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష మద్దతు సభ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సమ్మె కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలవాలని లండన్‌లో జరిగిన అఖిలపక్ష సభలో పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్, భాజపా, తెలంగాణా జనసమితి, తెదేపా, జనసేన, వైకాపాలతో కూడిన లండన్ ఐక్య వేదిక అఖిలపక్షం తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు తమ మద్దతును తెలిపింది. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రాం, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమిటిరెడ్డి వెంకట్, మాజీ మంత్రి డీకే అరుణ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రవాసులు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపడం పట్ల వీరంతా హర్షం వెలబుచ్చారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తమ వంతు కృషి చేయాలని నల్గొండ ఎంపీ కోమిటిరెడ్డి వెంకట్ సూచించారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. నిర్బంధాలు , హౌస్ అరెస్టులు ఉద్యమ అణిచివేత తో సమస్య మరో సమస్య కి దారి తీస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు లండన్ ఎన్నారైలు మద్దతు తెలపడం చాలా ధైర్యాన్నిచ్చిందని, తమ సమస్యలపై సీఎంకు అనేకసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకు దిగామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో లండన్ ఎన్నారైలు మాట్లాడుతూ.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం థేమ్స్ నదీతీరంలో, బ్రిటన్ పార్లమెంట్ ముందు ధర్నా చేసి కేసీఆర్‌కు బాసటగా నిలిచామని, అలాంటి కేసీఆర్ విధానాలపై మళ్లీ ఉద్యమం చేయవలసి రావడం బాధాకరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గంప వేణుగోపాల్, గంగసాని ప్రవీణ్ రెడ్డి,శ్రీధర్ నీలా, శ్రీనివాస్ దేవులపల్లి,నర్సింహా రెడ్డి తిరుపరి,మేరీ, జవహార్ రెడ్డి, జయంత్ వద్దిరాజు, పసునూరి కిరణ్ ,ప్రవీణ్ బిట్ల, రంగు వెంకటేశ్వర్లు, స్వామి ఆకుల,రాజు గౌడ్, కోటి,చైతన్య, అయ్యప్ప , హనీఫ్, అబ్దుల్,శివారెడ్డి, గణేష్ రెడ్డి, ఓరుగంటి కమలాకర్రావు, శ్రవణ్ గౌడ్,విశ్వనాధ్ కొక్కొండ తదితరులు పాల్గొన్నారు.