బిజెపి పార్టీకి పెరిగిన విరాళాలు..!

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేని నేపథ్యంలో మరోపక్క బిజెపి పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికే దేశంలో సగానికిపైగా రాష్ట్రాలలో బిజెపి పార్టీ అధికారంలో ఉండటం మరియు అదే విధంగా ఇటీవల జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీ 2014 సంవత్సరం కంటే ఎక్కువ మెజార్టీ స్థానాలు సాధించి కేంద్రంలో అధికారంలోకి రావటంతో చాలామంది దేశంలో ఉన్న ప్రముఖులు…సెలబ్రిటీలు బిజెపి పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి 2018-19లో భారీగా విరాళాలు వచ్చాయి. ఈ ఏడాది 700 కోట్ల రూపాయల మేర విరాళాలు వచ్చినట్లు బిజెపి ప్రకటించింది. ఆయా సంస్థలు, ట్రస్టులు ఈ మొత్తాన్ని సమకూర్చాయి. ఈ విరాళాల్లో దాదాపు సగం టాటాసన్స్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు నుంచే రావడం విశేషం. ఈ ట్రస్టు నుంచి రూ.356 కోట్లు అందాయి. ప్రూడెంట్ ట్రస్టు నుంచి 54 కోట్ల రూపాయల మొత్తం అందింది. ఓరియంట్ సిమెంట్, భారతీ గ్రూప్, హీరో మోటార్ కార్స్ తదితర సంస్థలు కూడా భారీగానే విరాళాలు అందచేశాయి.