మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. మంత్రివర్గ సమావేశం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఆమోదం తెలిపింది.

కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కోష్యారి తమకు గడువు పొడిగించకపోవడాన్ని సవాలు చేస్తూ శివసేన మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ తమకు సోమవారం రాత్రి 7.30 గంటల వరకే గడువు ఇచ్చారని, తాము మద్దతు లేఖలు సమర్పించలేదన్న కారణంతో తమకు ఇచ్చిన గడువును పొడిగించడానికి నిరాకరించారని శివసేన తన పిటిషన్‌లో పేర్కొంది. తమకు మరో మూడు రోజులు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ గవర్నర్ సమ్మతించలేదని శివసేన తన పిటిషన్‌లో తెలిపింది.