టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్..ఆర్టీసి సమ్మెకు మద్దతుగా ఎన్నారైలు!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరవధికంగా చేపడుతున్న సమ్మె ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు విదేశాలకు కూడా పాకింది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసి సమ్మెకు మద్దతుగా ప్రవాస భారతీయులు నిలిచారు. అమెరికాలోని కొంత మంది ఎన్నారైలు ఆర్టీసీకి మద్దతు తెలిపారు.

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఆదివారం తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్‌) 20వ వార్షిక వేడుకలను నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభ మధ్యలో లేచి ‘సేవ్‌ ఆర్టీసీ…సేవ్‌ ఆర్టీసీ’ అంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించారు సభకు హాజరైన ఎన్‌ఆర్‌ఐలు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె పై టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్‌ను నిలదీసారు మన ప్రవాస భారతీయులు. ఈ విధంగా వారు నినాదాలు చేయడంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాని నిర్వహకులు సర్ది చెప్పడంతో ఆందోళన సర్దుమనిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ప్రభుత్వ పాలనపై గొప్పగా చెప్పాలనుకున్న వినోద్‌కుమార్‌ షాకయ్యారు. ఎన్నారైల నుంచీ ఇలాంటి స్పందన వస్తుందని ఊహించని ఆయనకు అనుకోని షాక్ తగిలినట్లైంది. అయినప్పటికీ వినోద్ కుమార్ తన ప్రసంగాన్ని ఆపకుండా ఆ గందరగోళ పరిస్థతిలోనే ముగించారు.