ట్రంప్‌కు యూఎస్ కోర్టు బ్రేక్.. హెచ్‌-4 వీసాదారులకు శుభవార్త!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు తాత్కాలిక ఊరట లభించింది. హెచ్​1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న వారి స్పౌస్ (భార్య లేదా భర్త) కూడా పనిచేసుకోవచ్చని చెప్పింది. హెచ్-4 వీసాదారులు అమెరికాలో పనిచేసుకొనేందుకు కొలంబియా సర్క్యూట్ కోర్టు అనుమతినిచ్చింది. ట్రంప్​ సర్కారు పెట్టిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఈ వ్యవహారంలో ఫైనల్ జడ్జిమెంట్​ ఇచ్చేదాకా ఒబామా హయాంలో తీసుకొచ్చిన పాలసీనే కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

అమెరికన్​ కంపెనీలు విదేశాలకు చెందిన నిపుణులకు ఉద్యోగమివ్వడానికి హెచ్ 1 బీ వీసా తప్పనిసరి. ఈ వీసాతో అమెరికా చేరిన వారిని నాన్​ ఇమిగ్రెంట్లుగా పరిగణిస్తారు. ఉద్యోగం చేస్తూ, వీసా పర్మిట్​ను పొడిగించుకుంటూ, గ్రీన్​కార్డు కోసం ఎదురుచూస్తుంటారు. వీరు తమ లైఫ్ పార్ట్​నర్​ను అమెరికాకు పిలిపించుకునే అవకాశం ఉంది. హెచ్ 1 బీ వీసా హోల్డర్ల లైఫ్​ పార్టనర్​కు అమెరికా హెచ్ 4 వీసాలు జారీచేస్తుంది. ఈ వీసా హోల్డర్లకు ఉద్యోగంచేసే అవకాశం మాత్రంలేదు. గ్రీన్​ కార్డ్​ వచ్చాకే పనిచేసే వీలుండేది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ 2015 లో అప్పటి ఒబామా ప్రభుత్వం హెచ్ 4 వీసా విధానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. హెచ్ 4 వీసా వల్ల స్థానికులు నష్టపోతున్నారని.. అమెరికాలో ఉద్యమాలు తలెత్తాయి. అనంతరం ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హెచ్‌-1 బీ వీసాలపై కోత పెడుతూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసింది. ఈ చర్యలను సవాలు చేస్తూ అమెరికా కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీంతో విచార‌ణం చేప్ప‌ట్టిన కోర్టు ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ముగ్గురు న్యాయమూర్తుల యూఎస్ కోర్ట్సు ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్టును కోరింది. నిబంధనల్ని క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అప్పటి వరకు నిబంధనలను నిలుపుదల చేయడం ఉత్తమమని పేర్కొంది. అలాగే తుది తీర్పును కూడా నిలిపివేయాలని కోరింది. దీంతో వేలాది మంది భారతీయులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.