ఈసారి జగన్ ని గట్టిగా టార్గెట్ చేసిన బిజెపి..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒకపక్క ప్రజలకు మేలు చేస్తుంటే మరోపక్క కేంద్రంలో ఉన్న పెద్దలకు మరియు రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులకు దిమ్మతిరిగిపోయే విధంగా షాక్ ఇస్తున్నాయి.

కరెంట్ విషయంలో మరియు అనేక విషయాలలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముందుకు వెళుతూ మొండిగా వ్యవహరిస్తున్న జగన్ ని గట్టిగా టార్గెట్ చేస్తూ తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సరైన ప్లాన్ వేసినట్లు ఢిల్లీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

విషయంలోకి వెళితే ఇటీవల రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను పూర్తిగా తీసివేసి 1నుండి 6 వరకు ఇంగ్లీష్ మీడియం అమలుచేయాలి అంటూ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించాలని జీవో పాస్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో తెలుగు భాషను కొద్దిగా తక్కువ చేసి వైసీపీ నేతలు కామెంట్ చేయడం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఏకిపారేస్తున్నారు. తాజాగా బీజేపీ నేత ఎమ్మెల్సీ యాదవ్ జగన్ పై సంచలన ఆరోపణలు చేసారు.జగన్ తీసుకున్న నిర్ణయం అసలు అనాలోచితం అని పరిపక్వత లేని నిర్ణయంగా భావిస్తున్నామని వారు తెలియజేసారు.జగన్ ఏదో సాధించేసానని అనుకోడం కోసం కనీసం ఎలాంటి ఆలోచన కూడా చెయ్యకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

మరోపక్క సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు కొంతమంది సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అంటూ బయట ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఉద్యోగాలు సాధించాలంటే ఇంగ్లీష్ కంపల్సరి అని జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటూ సపోర్ట్ చేస్తున్నారు.