ట్విట్టర్ వేదికగా జగన్ పై లోకేష్ ఫైర్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టిడిపి శవరాజకీయాలు చేస్తుందని జగన్ గారు అనడం… వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు ఉందన్నారు నారా లోకేష్. ట్విట్టర్ వేదికగా జగన్ పై నిప్పులు చెరిగారు. శవరాజకీయాలకు జగన్ గారు బ్రాండ్ అంబాసిడరన్న విషయం మర్చిపోయినట్టు ఉన్నారు. ఆత్మహత్యలను అపహాస్యం చేస్తూ మాట్లాడటం ఇప్పటికైనా మానుకోండి అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు మాని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మరొక ట్వీట్ లో ..10 లక్షల మంది ఉద్యోగుల పై వేటు వేశారని ఆరోపించారు. ‘నాలుగు లక్షల మంది వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలివ్వడం కోసం,10 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశారు జగన్ గారు. పాదయాత్రలో అక్క, చెల్లీ మీ జీతం పదివేల రూపాయలు చేస్తానన్న జగన్ గారు ఒకే ఒక్క సంతకంతో 27,700 మంది వెలుగు యానిమేటర్లని రోడ్ల పైకి నెట్టేసి, వారి జీవితాల్లో వెలుగు లేకుండా చేశారు’ అని ట్వీట్ చేశారు.