అమెరికా ఎన్నికల్లో సత్తాచాటిన ఇండియన్ అమెరికన్స్

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్‌కు చెందిన ఘజాల హష్మీ అమెరికాలో చరిత్ర సృష్టించారు. గజాలా హష్మీ వర్జీనియా స్టేట్‌ సెనెట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన హష్మీ రిపబ్లికన్ పార్టీ సెనేటర్ గ్లిన్ స్టర్టివాంట్‌ను ఓడించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఎమోరీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆమె దాదాపు 25 ఏండ్లపాటు వర్జీనియాకు చెందిన కాలేజీ అండ్ యూనివర్సిటీ సిస్టమ్‌లో లీడింగ్ ఎడ్యుకేటర్‌గా సేవలందించారు. ప్రస్తుతం రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కాలేజ్‌లో సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ విభాగానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేసిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు, కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్‌ మనోహర్‌ రాజు శాన్‌ ఫ్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. అలాగే, ఉత్తర కాలిఫోర్నియాలోని ఛార్టోటీ సిటి కౌన్సిల్‌కు డింపుల్‌ అజ్మీరా మరోసారి ఎన్నికయ్యారు.