మరింత ఆలస్యం కాబోతున్న చిరంజీవి- కొరటాల సినిమా..?

 వాస్తవం సినిమా: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన రెండో సినిమా ‘సైరా’ తో తన స్టామినా ఏంటో టాలీవుడ్ ప్రేక్షకులకు రుచి చూపించారు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సైరా’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. దాదాపు రెండు సంవత్సరాలపాటు ‘సైరా’ సినిమా కోసం తన సమయాన్ని కేటాయించారు చిరంజీవి. అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో వెంటనే డైరెక్టర్ కొరటాల శివతో చేయబోయే సినిమా త్వరగా ప్రారంభించి వచ్చే వేసవికి విడుదల చేయాలని భావించి ఇటీవల దసరా పండుగ నాడు సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.

అయితే డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావించిన సినిమా యూనిట్…ఇప్పుడు ఆ ఆలోచన నుండి విరమించుకున్నట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే షూటింగ్ ఒక నెలరోజులు ఆలస్యంగా స్టార్ట్ కాబోతున్నట్లు దానికి గల కారణం చిరంజీవి పర్సనాలిటీ తగ్గించడం కోసమే అన్నట్లు టాక్ వినబడుతుంది. ఈ సినిమాలో డబుల్ రోల్ పాత్రలో చిరంజీవి నటించనున్నాడట. దీంతో ఒక పాత్రలో పూర్తిగా స్లిం గా చిరంజీవి కనిపించనున్నాడట. దీంతో ప్రస్తుతం బరువు తగ్గడానికి కసరత్తులు చేస్తున్న చిరంజీవి ఇంకా బరువు తగ్గాలని డైరెక్టర్ కొరటాల సూచించడంతో ఒక నెల రోజులు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఆలస్యం అవున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.