తిరుమలలో వసతి గదుల అద్దె పెంచుతూ టీటీడీ నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: కలియుగ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమలలో నిన్నటివరకూ రూ. 500 నుంచి రూ. 600 వరకూ ఉన్న గదుల అద్దెను ఏకంగా రూ. 1000కి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో రూ. 100కు లభించే సాధారణ గదుల అద్దెలను మాత్రం అలానే ఉంచింది. అయితే, రూ. 100 గదులు ఎంతమందికి అందుబాటులో ఉంటాయన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

తిరుమలలో రూ. 100 అద్దె గదులు దాదాపు 500 వరకూ అందుబాటులో ఉంటాయి. ఇంటికి నలుగురు చొప్పున వేసుకున్నా, అవి 2 వేల మందికి మాత్రమే సరిపోతాయి. ఈ పరిస్థితుల్లో పేదలకు నిలువ నీడ ఎక్కడుంటుందన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, తమ మొక్కులను తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చే పేదలు, సర్వదర్శనం క్యూలైన్లలో గంటల తరబడి వేచి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. టీటీడీ నిర్ణయంతో వారికిక క్యూలైన్లే వసతిగా మారే పరిస్థితి ఏర్పడింది. ఇక దిగువ మధ్య తరగతి ప్రజల పరిస్థితి కూడా అంతే. రెండేళ్ల క్రితం రూ. 350 గా ఉండే పాంచజన్యం అద్దె గదుల ధర ఇప్పుడు రూ. 1000కి పెరిగింది. రూ. 500గా ఉండే కౌస్తుభం తదితర వసతి సముదాయాల్లోనూ అద్దె రూ. 1000 అయింది.