నేడు ఎల్‌కె అద్వానీ 92వ జన్మదినం..శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

వాస్తవం ప్రతినిధి: బిజెపి కురు వృద్ధుడు ఎల్‌కె అద్వానీ 93వ ఏట అడుగుపెట్టారు. నేడు 92వ పుట్టిన రోజు చేసుకున్న అద్వానీకి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా తదితరులు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. అవిభక్త భారత్‌లోని కరాచీలో 1927 నవంబర్‌ 8వ తేదీన అద్వానీ పుట్టారు. దేశ విభజన తరువాత కరాచీనుంచి అద్వానీ కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయితో కలిసి బిజెపి ఏర్పాటు చేసి దానిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లడంలో అద్వానీ విశేష కృషి చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అద్వానీ రామ రథ యాత్ర చేపట్టారు. దీనితో దేశంలో బిజెపి పట్ల ఆదరణ పెరిగింది. అప్పటికి కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్న పార్లమెంటులో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని బిజెపి సత్తా చాటారు. అద్వానీ ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో అద్వానీ పోటీ చేయలేదు. ఇటీవల కొద్దికాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న అద్వానీ 2014నుంచి బిజెపి మార్గదర్శక మండలిలో సభ్యుడిగా ఉన్నారు.