వైకాపా నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: బుద్ధా వెంకన్న

వాస్తవం ప్రతినిధి: విజయసాయిరెడ్డి గారు మీరు నోటికి అన్నమే తింటున్నారా అని ప్రశ్నించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. భవన నిర్మాణ కార్మికులు వ్యక్తిగత కారణాలతో చనిపోయారని మాట్లాడటానికి సిగ్గుగాలేదా అంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. భవన నిర్మాణ కార్మికుల హత్యలు ప్రభుత్వ హత్యలు కాకపోతే ఎందుకు ఐదు లక్షల పరిహారం ఇచ్చారో చెప్తారా అంటూ విమర్శించారు. మీ ప్రభుత్వం చేతకాని నిర్ణయాల వల్ల 40 మంది కార్మికులను పొట్టన పెట్టుకుని సిగ్గులేకుండా ఎలా మాట్లాడతారన్నారు. ‘రైతులకు రుణమాఫీ అవసరం లేదు’, ‘అది సాధ్యం కాదు’, ‘కడుపు నిండిన రైతులకు రుణమాఫీ ఎందుకు?’ అంటూ రైతులను అవహేళన చేసిన జగన్ వ్యాఖ్యలు మర్చిపోయి రైతుల గురించి మాట్లాడుతున్నారు.వైకాపా నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ రాసుకొచ్చారు బుద్ధా. వాలంటీర్లు అంతా వైకాపా వాళ్లే అని దైర్యంగా చెప్పిన మీరు వరద వల్ల ఇసుక లేదు అని అబద్దాలెందుకు చెప్పటం, సిమెంట్ కంపెనీలతో జగన్ కి ఇంకా బేరం కుదరలేదని నిజం ఒప్పుకోండి అంటూ విమర్శించారు.