అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ స్పీకర్..!

వాస్తవం ప్రతినిధి: దాదాపు ఎనిమిది రాష్ట్రాలలో అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలు ఉన్నాయి. అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసిన మోసానికి మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న నాయకుడు జగన్ అని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్కాం చంద్రబాబు హయాంలో బయటపడిన నేపథ్యంలో…ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కయి సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద మోసగాడని ఆరోపించారు.

హాయ్‌ల్యాండ్ భూములును కొట్టేసేందుకు చంద్రబాబు, నారా లోకేశ్ ప్లాన్ వేశారని స్పీకర్ ధ్వజమెత్తారు. ఎనిమిది రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ కంపెనీ మోసాలకు పాల్పడిందని.. అయితే బాధితులకు పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రపదేశ్ మాత్రమేనని తమ్మినేని స్పష్టం చేశారు. హాయ్ ల్యాండ్ భూములను చంద్రబాబు తన కుమారుడి పేరిట రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని… ఈ వ్యవహారంలో సీఎం రమేశ్, యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారని తమ్మినేని సీతారాం ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల తిరుగుబాటు, పోరాటం కారణంగా అప్పటి ముఖ్యమంత్రి అడుగు ముందుకు వేయలేకపోయారని.. ఒక రకంగా హాయ్‌ల్యాండ్ ఆస్తుల్ని బాధితులే రక్షించుకున్నారని స్పీకర్ ప్రశంసించారు.