అయోధ్య అంశానికి సంబంధించి కేంద్ర మంత్రులకు మోదీ వార్నింగ్

వాస్తవం ప్రతినిధి: అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు మరికొద్ది రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో తన సహచర కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ హెచ్చరించారు. దేశంలో సామరస్యపూర్వక వాతావరణం దెబ్బతినేలా ఈ అంశానికి సంబంధించి ఎవరూ అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని, సామరస్యాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగా అయోధ్య వివాదంపై తీర్పు వెలువరించనున్నారు. కోర్టు తీర్పుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కు భారీ సంఖ్యలో అదనపు భద్రతాబలగాలను తరలిస్తున్నారు. ఎలాాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాల తరలింపు జరుగుతోంది.

మరోవైపు అక్టోబర్ 27న జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, అయోధ్య కేసులో తీర్పును ఎవరూ కూడా ఒక ఓటమిగానో, గెలుపుగానో భావించరాదని తెలిపిన సంగతి తెలిసిందే.