అత్యధిక హెచ్‌-1బి వీసాల తిరస్కరణలు ట్రంప్‌ హయాంలోనే…!

వాస్తవం ప్రతినిధి: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధానాల ఫలితంగా అమెరికా వెళ్లాలనుకునే వారి కలలు కల్లలుగానే మిగిలిపోయాయ్యి. అమెరికాలో వలసలను తగ్గించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకుగాను ట్రంప్‌ సర్కార్‌ వీసా నిబంధనలలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నిర్ణయం వలన హెచ్‌-1బి వీసాలు అధికంగా తిరస్కరణకు గురైనట్లుగా, అందులో అధికంగా భారతదేశానికి చెందిన ఐటీ కంపెనీల నుంచి వచ్చినవేనని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగావకాశాల్లో అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంతో.. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత ఐటీ కంపెనీల హెచ్‌-1బీ వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇదే విషయాన్ని పలు భారతీయ కంపెనీలు గగ్గోలు పెడుతున్నా.. అమెరికన్ ట్రంప్ ప్రభుత్వం మాత్రం మితిమీరిన జాతీయవాదాన్ని చూపిస్తుందని పలు ఐటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. విప్రో చేసిన వాటిల్లో తిరస్కరణలు అత్యధికంగా 53 శాతానికి పెరిగినట్లుగా, తరువాతి స్థానంలో ఇన్ఫోసిస్‌ 45 శాతానికి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ 34 శాతం, టెక్‌ మహింద్ర 41శాతానికి పరిమితమయ్యాయి. హెచ్‌-1బి వీసాల తిరస్కరణలు 2015 వరకు 6 శాతానికి మించి దాటలేదని, ట్రంప్‌ సర్కార్‌లో మాత్రమే వీసాల తిరస్కరణ దరఖాస్తుల సంఖ్య రికార్డు గరిష్ఠానికి తాకాయని నాస్కామ్ లోని అంతర్జాతీయ వ్యాపార విభాగ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. వలస విధానాల్లోని కఠిన నిబంధనలు, పాలసీల్లోని మార్పుల కారణంగా ట్రంప్‌ ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరిందని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ అభిప్రాయపడింది. అమెరికాలో కొత్త ఇన్వెన్షన్స్ కొరవడటం మూలంగా ఆ దేశం తీవ్రంగా నష్టపోనుందని , ఇది ట్రంప్ పాలనా వైఫల్యంగా మిగిలిపోనుందని అమెరికన్ సంస్థ వాఖ్యానించింది. ప్రస్తుతం భారతీయ నైపుణ్య ఉద్యోగులు, స్కిల్ట్ లేబర్ కెనడా, ఆస్ట్రేలియాల వైపు చూస్తుండటంతో ఆ దేశాలు వారి కోసం గేట్లను తెరిచే ఉంచాయి. అమెరికా కలలను భారతీయులు కెనడా, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల వైపు మళ్ళిస్తున్నారు.