ఇరాక్ లో మళ్ళీ భారీ ఆందోళనలు

వాస్తవం ప్రతినిధి: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మళ్ళీ ‘ ప్రజా ఉద్యమం ‘ తలెత్తింది. తాజాగా శుక్రవారం జరిగిన ప్రదర్శనల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. దేశంలోని నిరంకుశ ప్రభుత్వం తమను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. బాగ్దాద్‌లోని తహ్రీర్‌స్క్వేర్‌లో గుమికూడిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించాయి. పోలీసుల దాడుల్లో ఒక మహిళ మృతి చెందగా, 155 మందికి గాయాలయ్యాయని ఇరాక్‌ మానవ హక్కుల కమిషన్‌ ఈ సందర్భంగా తెలిపింది. ఇటీవలే ఇరాక్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు ఇదే డిమాండుతో ర్యాలీలు నిర్వహించారు. అనేకచోట్ల జాతీయ పతాకాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఇరాన్ తో తమ దేశ ప్రభుత్వం ‘ అంట కాగడాన్ని ‘ వారు ఖండించారు.

తాము శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ తమ పైకి భాష్పవాయువు ప్రయోగిస్తున్నారని, తామేమి ఐఎస్‌ ఉగ్రవాదులం కాదని ఒక బాధితుడు తెలిపాడు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో శుక్రవారం మాట్లాడుతూ హింసకు దూరంగా ఉండాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.