ఉగ్ర మూలాల్ని నాశనం చేశాం: ప్రధాని మోదీ

వాస్తవం ప్రతినిధి: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ)పై చర్చలు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో.. భారత్‌ దానిలో చేరుతుందా లేదా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు సమీపంలోని నాంతాబురిలో సోమవారం ఆర్‌సీఈపీ సదస్సు జరుగనుంది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఆర్‌సీఈపీలో చేరడానికి ముందు, విస్తారమైన భారతీయ మార్కెట్‌కు ద్వారాలు తెరువాలంటే..‘అస్థిరమైన వాణిజ్య లోటు’పై తమకున్న సందేహాలు నివృత్తి కావాలని, తమ దేశంలోకి వచ్చే ఇతర దేశాల వ్యాపారవేత్తలు లాభపడే రీతిలోనే తమ దేశపు వ్యాపారులకు కూడా సమాన స్థాయిలో అవకాశాలుండాలని స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ స్పష్టం చేశారు. ఈ అంశాలను ఆర్‌సీఈపీ సదస్సులో పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. మోదీ 16వ ఆసియాన్‌-భారత్‌ సదస్సు, 14వ తూర్పు ఆసియా సదస్సులో కూడా పాల్గొననున్నారు.

మరో వైపు ప్రధాని భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు మూలాలను నాశనం చేశాం. ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ను రద్దు చేశాం. జమ్మూకశ్మీర్‌కు సొంత రాజ్యాంగాన్ని కల్పించడం వంటి అనేక తాత్కాలిక నిబంధనలను తొలగించాం. మన నిర్ణయం సరైందే అని ప్రపంచం గుర్తించింది. థాయ్‌లాండ్‌లోనూ అదే విషయం ప్రతిధ్వనించింది. మీరిచ్చే ప్రశంసలు భారత్‌ పార్లమెంట్, పార్లమెంట్‌ సభ్యులకే చెందుతాయి’అని ప్రధాని పేర్కొన్నారు. దీంతో అక్కడి వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.