రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా.. 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో.. ఆంధ్ర రాష్ట్రం కాస్తా.. ఆంధ్రప్రదేశ్‌గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.

2014 జూన్ 2న రాష్ట్రం విడిపోయాక.. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకొంటున్నారు. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం.. అవతరణ దినోత్సవం జరుపుకోలేదు. నవ నిర్మాణ దీక్షల పేరిట దీక్షలు నిర్వహించింది. జగన్ సీఎం పగ్గాలు చేపట్టాక.. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి హజరయ్యారు.

రాష్ట్ర అవతరణ వేడుకల నేపధ్యంలో భారతావనికి స్వేఛ్చా వాయువులు ప్రసాదించటంలో కీలక భూమికను పోషించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోనున్నారు. వారికి నివాళి అర్పించటంతో పాటు, దివంగత సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వపరంగా సత్కారం చేయనున్నారు. రాష్ట్ర పధమ పౌరుడు బిశ్వ భూషణ్ హరిచందన్, రాష్ట్రాధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల చేతుల మీదుగా వీరు గౌరవాన్ని అందుకోనున్నారు.

నవంబరు మూడవ తేదీ వరకు ప్రతి సాయంత్రం కూచిపూడి నృత్యాలు, సురభి నాటకములు, లలిత సంగీతం, జానపద కళారూపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక అలరించనుందని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వివరించారు.