డిసెంబర్ 12న బ్రిటన్ ఎన్నికలు

వాస్తవం ప్రతినిధి: బ్రెగ్జిట్ ప్ర‌తిష్టంభ‌న‌ను తొల‌గించేందుకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ చేసిన ప్ర‌య‌త్నం చివ‌ర‌గా ఫ‌లించింది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 12వ తేదీన బ్రిట‌న్ పార్ల‌మెంట్‌కు సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 418 అనుకూల ఓట్లతో తీర్మాణం పాస్ అయింది. 20మంది ఎంపీలు వ్యతిరేకించారు. ఎన్నికల కోసం ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పార్లమెంటు నుండి ఆమోదం పొందడంతో దాదాపు శతాబ్దం తర్వాత డిసెంబర్ లో మొదటిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. 1923 తర్వాత మొదటిసారి డిసెంబర్‌లో బ్రిటన్‌ ఎన్నికలు జరగబోతున్నాయి.

బ్రిటన్‌లో సాధారణంగా చలికాలంలో ఎన్నికలు జరగవు. ప్రతికూల వాతావరణమే కారణం, డిసెంబర్‌లో ఇక్కడ చలి తీవ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతాయి. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం అవుతుంది. చలికాలం బ్రిటన్‌లో పగలు తక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత నుంచే చీకట్లు అలుముకుంటాయి. అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం సవాలుగా మారుతుంది.

క్రిస్మస్, పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిసెంబర్ 12న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చోటు దొరకడం కూడా కష్టం అవుతుంది. అలాంటప్పుడు, పోలింగ్ కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సుంటుంది. ప్రజలను అక్కడి వరకూ తరలించడం కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవచ్చని కూడా అనుకుంటున్నారు. అంతే కాదు, ఆ సీజన్లో ఎన్నికలు ఎంపీలకు కూడా కష్టాలు తీసుకొస్తాయి. ఎందుకంటే తీవ్రమైన చలికాలంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం చాలా కష్టం.