తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా తిరుపతి చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం తొలుత వరాహస్వామిని దర్శించుకున్న తమిళి సై అనంతరం వీఐపీల సేవా సమయంలో స్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డిలు గవర్నర్‌కు తీర్థప్రసాదాలు అందజేసి, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు.

దర్శనానంతరం ఆలయం వెలుపల గవర్నర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను శ్రీవారి భక్తురాలినని, స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తిరుమలలో వసతి సదుపాయాలు, నిర్వహణ బాగుందని కితాబిచ్చారు.