కచ్చులూరు – ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్.. బయటపడుతున్న మృతదేహాలు.

వాస్తవం ప్రతినిధి: కచ్చులూరు – ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లతీరానికి చేర్చే అవకాశాలున్నాయి.కాగా, బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో బయటకు వచ్చింది. అనుకున్నట్టుగానే బోటులోని ఏసీ గదిలోనుంచి మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బోటును బయటకు వచ్చిన తరువాత ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకా లోపల ఎన్ని ఉన్నాయి అన్నది తెలియాల్సి ఉన్నది.

కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగింది. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలు వెళ్తుండగా బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77మంది టూరిస్టులు ఉన్నారు. ప్రమాదం నుంచి 26మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 39 మృతదేహాలు వెలికితీశారు. మరో 12 మృతదేహాలు బోటులో ఉండొచ్చని అనుమానిస్తున్నారు.