ఎన్నికల విషయంలో ఇరుక్కుపోయిన కేసీఆర్ సర్కార్..?

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లిన కేసీఆర్ అద్భుతమైన మెజార్టీ సాధించి సొంతంగా తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గట్టి షాక్ ఇవ్వడంతో అధికారంలో ఉన్న కేసీఆర్ ఆ తర్వాత జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల విషయంలో చాలా ఆలోచించి, జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ఓటర్ల విషయంలో అవకతవకలు అప్పట్లో జరిగినట్లు ఇందువల్ల తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని కూడా పిటిషనర్లు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా ఏకపక్షంగా ప్రక్రియను పూర్తి చేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించింది. ఈ విషయంలో రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ సర్కార్ నిర్వహిస్తుందో లేదో చూడాలి.

ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం పై ఆర్టీసీ కార్మికుల చేసిన సమ్మెతో తీవ్ర వ్యతిరేకత రాష్ట్రంలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఒకపక్క ఉప ఎన్నికలు మరోపక్క మున్సిపల్ ఎన్నికలు అన్న విషయం రావటంతో కెసిఆర్ సర్కార్ పని అటూ ఇటూ కాకుండా ఇరుక్కు పోయినట్లు ఉంది అంటూ చాలామంది రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ తాడో పేడో తేల్చుకోవాల్సిన టైం వచ్చిందని ఎన్నికలు కచ్చితంగా ఎదుర్కోవాలి అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.