అజ్ఞాతంలోకి కల్కీ భగవాన్‌..ఐటీ దాడులపై స్పందించిన ఆశ్రమ ప్రముఖులు

వాస్తవం ప్రతినిధి: కల్కి ఆశ్రమాల్లో ఐటీ రైడ్స్‌ కొలిక్కి వచ్చాయి. చిత్తూరు, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరుల్లో జరిపిన తనిఖీలు ముగింపుకొచ్చాయి. మొత్తం 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఐటీ టీమ్స్‌… ఇప్పటివరకు 300మందిని విచారించారు.

ఐటీ దాడులపై కల్కి ఆశ్రమం స్పందించింది. ఆశ్రమంపై ఐటీ దాడులు జరిగాయని… అధికారులకు పూర్తిగా సహకరించామని సునీల్ దాసాజీ తెలిపారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పామన్నారు. తదుపరి విచారణకు సహకరిస్తామని అన్నారు. ఐటీ దాడుల తర్వాత ఆశ్రమంలో కార్యకలాపాలు యధావిధిగా జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే, కల్కీ భగవాన్‌గా చెప్పుకుంటున్న విజయ్‌కుమార్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండగా, అతని కుమారుడి నుంచి కూడా సరైన సమాధానాలు రాలేదని తెలుస్తోంది.

కల్కి ఆశ్రమాల్లో గుట్టలుగుట్టలుగా పడివున్న నగదును, బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 40కోట్ల ఇండియన్ కరెన్సీ, అలాగే 22కోట్ల విదేశీ కరెన్సీని సీజ్ చేశారు. ఇక, కల్కి విలాసవంత భవనమైన వైట్‌ లోటస్‌లో పెద్దఎత్తున వజ్రాలు, బంగారం, దేశ, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కీలక భూ డాక్యుమెంట్లతోపాటు హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లను అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. అదేవిధంగా ఆశ్రమ సిబ్బంది స్టేట్ మెంట్స్ చేశారు. అలాగే ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలంటూ ఆశ్రమ ప్రముఖులను ఆదేశించారు. అయితే, 85కోట్ల రూపాయలు హవాలా ద్వారా వచ్చినట్లు గుర్తించిన ఐటీ అధికారులు…. 5వందల కోట్ల లావాదేవీలకు లెక్కలు దొరకడం లేదని అంటున్నారు.