మహారాష్ట్ర, హర్యానా లలో కొనసాగుతున్న పోలింగ్

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ కి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, బరిలో 3,237 మంది ఉన్నారు. వీరిలో 235 మంది మహిళా అభ్యర్థులు.

మహారాష్ట్రలోని లాతూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్థానికులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు.

ఇక హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1169 మంది పోటీలో ఉన్నారు. వీరిలో 104 మంది మాత్రమే మహిళలు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 స్థానాలు, మహారాష్ట్రలోని సతారా, బీహార్‌లోని సమస్తీపూర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 24న ఫలితాలు వెలువడతాయి.