పాకిస్థాన్‌ సైన్యం భారత్ కు గట్టి బుద్ధి చెబుతుంది : ముషారఫ్

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌తో కయ్యానికి భారత్‌ కాలుదువ్వుతోందని, తమ సైన్యం వారికి గట్టి బుద్ధి చెప్పడం ఖాయమని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ముషారఫ్‌ అన్నారు. రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆయన, సైన్యం ప్రాపకం కోసం ముందుగానే ఈ పొగడ్తలు వదులుతున్నట్టు భావిస్తున్నారు. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముషారఫ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో చికిత్స పొందుతున్నారు. 2007లో పాకిస్థాన్‌ రాజ్యాంగాన్ని సస్పెండ్‌ చేసినందుకు ఆయనపై దేశంలో రాజద్రోహం కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ తన పార్టీని పట్టాలపైకి తెచ్చి పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న ఆయన సైన్యాన్ని మంచి చేసుకునేందుకు వారికి మద్దతుగా మాట్లాడారు. పాకిస్థాన్‌ సైనికులు చిట్టచివరి రక్తపు బొట్టు వరకు పోరాడే శక్తి ఉన్న వారని, పాకిస్థాన్‌పై భారత్‌ ఎలాంటి దుస్సాహసానికి సిద్ధపడినా దెబ్బతినడం ఖాయమని చెప్పారు.