బసవతారకం ట్రస్టీ డాక్టర్ తులసీదేవి కన్నుమూత

వాస్తవం ప్రతినిధి: తెలుగు నేల ప్రజలకు కారు చౌకగా కేన్సర్ వైద్యం అందడానికే కాకుండా… ప్రపంచంలోని అత్యంత ఆధునిక చికిత్సలు కేన్సర్ రోొగులకు అందిస్తున్న బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటులో కీలక భూమిక పోషించడమే కాకుండా… విదేశాల్లో పేరు పొందిన వైద్యురాలిగా ఖ్యాతి గడించిన డాక్టర్ పోలవరపు తులసీదేవి(80) ఇక లేరు.

తెలుగు నేలలో వైద్య వృత్తిని అభ్యసించి అగ్రరాజ్యం అమెరికాలో గైనకాలజిస్ట్ గా తనదైన శైలి సేవలు అందించి… అక్కడి మన ప్రవాసాంధ్రులకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న తులసీదేవి… శనివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అమెరికా నగరం న్యూయార్క్ లోని తన సొంత నివాసంలోనే ఆమె మరణించారు.

డాక్టర్ తులసీదేవి మరణం ఇక్కడి మన గుండెలను బరువెక్కించడంతో పాటు అక్కడి మన ప్రవాసాంధ్రులను శోకసంద్రంలో ముంచేసిందనే చెప్పాలి. వైద్య వృత్తిలో తనదైన శైలి సేవలు కొనసాగిస్తూనే.. తన సొంత ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన తులసీదేవి మరణం నిజంగానే తెలుగు ప్రజలకు తీరని శోకం మిగిల్చేదే.