భారత్-చైనా మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై సరికొత్త విధానం

వాస్తవం ప్రతినిధి: తమిళనాడులోని మామళ్లపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ అనధికార శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశం కోసం చెన్నై వచ్చిన జిన్‌పింగ్‌ రెండు రోజులపాటు మామళ్లపురంలో పర్యటించి అక్కడి శిల్పాలను, ఆలయాలను సందర్శించారు. అనంతరం చెన్నై చేరుకున్న జిన్‌పింగ్‌ ఇక్కడినుంచి నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. సమావేశం ముగిసిన అనంతరం చెన్నై చేరిన మోడీ కూడా ఢిల్లికి బయలుదేరి వెళ్లారు.

కాగా మొత్తం రెండు రోజుల్లో మోదీ, జిన్‌పింగ్‌ మొత్తం ఆరు గంటల పాటు ముఖాముఖి భేటీ జరగగా రెండు దేశాల మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి, వాణిజ్య, అంతర్జాతీయ బోర్డర్ వంటి వంటి విషయాలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు లేదు. కేవలం వాణిజ్యం, సహకారం వంటివాటిపైనే చర్చలు జరిపారు .

ఇరువురు నేతల చర్చల అనంతరం ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో భారత్‌ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, చైనా తరఫున వైస్‌ ప్రీమియర్‌ హు చుంగ్‌హువా పాల్గొనగా భారత్‌, చైనా మధ్య పరస్పర సహకారం, పర్యాటకం, వాణిజ్యం తదితర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై సరికొత్త విధానం ద్వారా చర్చలు జరపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

ఇక ఈ భేటీలో మోదీ, జిన్‌పింగ్‌ మధ్య కశ్మీర్‌ అంశం ప్రస్తావనే రాలేదని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత విషయమని మరోసారి స్పష్టం చేసిన గోఖలే ఉగ్రవాదంపై సవాళ్ల గురించి ఇరువురు చర్చించినట్లు తెలిపారు.