అమెరికా హెచ్చరికలపై మండిపడ్డ చైనా

వాస్తవం ప్రతినిధి: అమెరికా హెచ్చరికలపై చైనా మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. చైనాలోని పశ్చిమ ప్రాంతంలో ముస్లింలపై అణచివేత చర్యలను వెంటనే ఆపివేయాలని… లేకపోతే ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న చైనా అధికారులకు వీసాలను రద్దు చేస్తామని అమెరికా హెచ్చరించింది. వీసాల రద్దు అధికారులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. వారి పిల్లలు అమెరికాకు వచ్చి చదువుకోలేరని పేర్కొంది. ఈ హెచ్చరికలపై చైనా మండిపడింది. మతం పేరుతో తమ గడ్డపై తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న వారిని క్షమించలేమని తెలిపింది. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయడానికే తాము కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలను చేపట్టామని వెల్లడించింది. తాము చేపట్టిన చర్యలను జిన్ జియాంగ్ లో ఉన్న రెండున్నర కోట్ల మంది ప్రజలు కొనియాడుతున్నారని తెలిపింది. తమ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడానికే తమపై అమెరికా అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడింది.