చైనా మిలటరీ ఉన్నతాధికారులతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ చర్చలు

వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడి మిలటరీ ఉన్నతాధికారులతో సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌‌పింగ్ అధికారిక పర్యటన కోసం భారత్‌కు రావాల్సి ఉండగా.. దానికి కొద్ది రోజుల ముందే జనరల్ బజ్వా చైనా పర్యటనకు వెళ్లడం గమనార్హం. స్థానిక మీడియా కథనం ప్రకారం.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఉన్నతాధికారులతో బజ్వా జమ్మూ కశ్మీర్ పరిస్థితిపైనా, అక్కడ భారత్ చేపట్టిన భద్రతా ఏర్పాట్ల పైనే ప్రధానంగా చర్చలు జరిపారు. పీఎల్ఏ ప్రధాన కార్యాలయంలో పీఎల్ఏ కమాండర్ ఆర్మీ జనరల్ హాన్ విగువో, సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్ జనరల్ జు ఖిలియాంగ్ తదితరులతో సమావేశమైన బజ్వా.. కశ్మీర్ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తినట్టు బీజింగ్ అధికారులు ధ్రువీకరించారు.