కెసిఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి..!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ అతి తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుని టీ కాంగ్రెస్ సీనియర్ నేతలకు దిమ్మతిరిగి పోయే విధంగా తన హవా పెంచుకుంటూ ఢిల్లీలో కూడా తన పరపతి పెంచుకుంటూ వస్తున్న తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాజకీయ నేత రేవంత్ రెడ్డి రాజకీయంగా తనకు టార్గెట్ అయిన కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలపై షాకింగ్ కామెంట్ చేశారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు మద్దతుగా మాట్లాడుతూ కార్మికులపై ఎస్మా చట్టం ప్రయోగిస్తానని కెసిఆర్ అంటున్నారని, కాని ఆరేళ్లుగా సెక్రటేరియట్ కే రాని కెసిఆర్ పైనే పిడి చట్టం ప్రయోగించి అండమాన్ జైల్లో పెట్టాలా అని రేవంత్ అన్నారు. విచారణకు రాబోతున్న కేసుల విషయం లో ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ 35 రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి మా ట్లాడేందుకు కేసీఆర్‌కు తీరిక లేదా అని ఆయన ద్వజమెత్తారు. ఉద్యమ సమయంలో పోరాట యోధుల్లా కనిపించినవారు ఇప్పుడు బానిసలు, కుక్క తోకలుగా కనిపిస్తున్నారా అని ఆయన అన్నారు. 50వేల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డుపైకి తెస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలానే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో కెసిఆర్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.