అసలు ఆ ఇల్లు చంద్రబాబుది కాదు అంటున్న బొత్స సత్యనారాయణ…!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గతంలో నివాసం ఉన్న కృష్ణానది పక్కన కరకట్ట పై ఉన్న ఇంటి చుట్టూ రాజకీయం జరుగుతుంది. అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీ టీడీపీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కృష్ణానది పక్కన కరకట్ట పై నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కట్టిన కట్టడాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి భజన చేసే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని విష ప్రచారం చేస్తోందని , సి.ఆర్.ఎడి.ఎ. అదికారులు పాతూరి కోటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన అక్రమ కట్టడాన్ని తొలగిస్తుంటే,ఎల్లో మీడియా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇల్లును తొలగిస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు లింగమనేని రమేష్ ది అని, ఆయనకు కూడా అక్రమ కట్టడానికి సంబందించి నోటీసు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు.గతంలో ఇదే ఇంటిని చంద్రబాబు కూడ అక్రమ నిర్మాణమని, పూలింగ్ లో తీసుకుంటున్నామని చెప్పారని, ఇప్పుడు మాట మార్చుతున్నారని బొత్స అన్నారు.అక్రమ కట్టడాలను తొలగించాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చామని బొత్స చెప్పారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందని గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు…ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా కట్టిన కట్టడాలు కూల్చడం అన్నది తప్పుగా భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని బొత్స సూచించారు.