టీడీపీ నేత కు భారీ కాంట్రాక్ట్ అప్పజెప్పిన వైసీపీ ప్రభుత్వం..?

వాస్తవం ప్రతినిధి: గత సార్వత్రిక ఎన్నికల్లో అనగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించింది వైసిపి. కేవలం 23 శాసనసభ స్థానాలు మూడు పార్లమెంటు స్థానాలు మాత్రమే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి దక్కింది. దీంతో ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని చాలా మంది ఆ పార్టీలో ఉన్న నాయకులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు కామెంట్లు చేయడం జరిగింది. ఇదే క్రమంలో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా తనకు ఎదురు లేకుండా ఉండటం కోసం తన ప్రత్యర్థులను వారికి సంబంధించిన కేసులను బయటకు తీస్తూ రాజకీయంగా అణిచి వేసే కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి మనకందరికీ తెలిసినదే.
ఇదిలా ఉండగా తెలుగుదేశం వైసిపి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా రాజకీయాలు ఉండగా తెలుగుదేశం పార్టీ నేతకు తాజాగా వైసీపీ ప్రభుత్వం భారీ కాంట్రాక్ట్ అప్ప చెప్పినట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కొంతమంది కాంట్రాక్టర్లపై నేరుగానే అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో భారీగా దోచిన వారికే అయాచిత లబ్ధి కలుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఒక భారీ కాంట్రాక్టు తెలుగుదేశం నేతకే దక్కుతోందని సమాచారం. అది గ్రామ సచివాలయాల నిర్మాణం – వాటిల్లో ఏర్పాట్లకు సంబంధించిన భారీ కాంట్రాక్టును తెలుగుదేశం నేత ఒకరు పొందినట్టుగా తెలుస్తోంది. ఆయన పేరు సుధీర్ చౌదరి. అక్షర ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థకు యజమాని అయిన సుధీర్ చౌదరి ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టును పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఈయన ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతగా రాణిస్తూ మరోపక్క కాంట్రాక్టర్ గా కూడా రాణిస్తున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.