సహనం కోల్పోతున్న టీ కాంగ్రెస్ నేతలు..!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గుర్తించ లేక పోవడానికి గల కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అని కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడూ టీ కాంగ్రెస్ నేతలను విమర్శిస్తుంటారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అడుగు పెట్టాడో, కాంగ్రెస్ హైకమాండ్ ఎక్కువగా రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టిందో, అప్పటి నుండి ఎప్పటినుండో పార్టీనే నమ్ముకుని విధేయులుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ సహనాన్ని కోల్పోతున్నారు. తాజాగా ఇటీవల కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి….రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసెంబ్లీ లో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్ధిగా పెట్టాలో మాకు తెలియదంటూ మండిపడ్డారు. మా జిల్లా విషయంలో పక్క జిల్లా నేతలు, ఈ మధ్యే పార్టీలోకి వచ్చిన వాళ్ల సలహాలు తమకు అవసరం లేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చెబుతున్న అభ్యర్ధి పేరు నాకే కాదు.. ఆ ప్రాంత నేత జానారెడ్డికి కూడా తెలియదన్నారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ పద్మావతిని నిలబెట్టి గెలిపించుకుంటామని, ఆమె అయితేనే సరైన అభ్యర్ధి అని కోమటిరెడ్డి వెల్లడించారు. 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నామని.. తమను కాదని కొత్త అభ్యర్ధిని పెడతారా అని వెంకటరెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డి, ఉత్తమ్, తాను ఒక్కటయ్యామని.. గతంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండేవని, కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అలాగే తాను పీసీసీ చీఫ్ రేసులో లేనని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మరోపక్క రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న నాయకులపై మీడియా సమావేశం పెట్టి చెలరేగిపోయారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.