కోడెల మరణం వెనక చంద్రబాబు హస్తం ఉంది అంటున్న రోజా..!

వాస్తవం ప్రతినిధి: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్ ఇటీవల చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కోడెల శివప్రసాద్ చావు చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ అధికార పార్టీ వైసీపీ వేధింపుల వల్ల పులి లాగ వుండే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడానికి గట్టిగానే వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. దీంతో వైసిపి పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా కోడెల మరణ వార్త పై స్పందించి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అవమానించడం వల్లే కోడెల శివప్రసాద్ మరణించారని ఆత్మహత్య చేసుకున్నారని చివరి క్షణాల్లో కోడెల శివప్రసాద్ చంద్రబాబుని కలవడానికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని రోజా పేర్కొన్నారు. సొంత మామ టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మరియు వంగవీటి రంగా వంటి వ్యక్తుల మరణాల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఇప్పుడు తాజాగా కోడెల మరణంలో కూడా చంద్రబాబు హస్తం కచ్చితంగా ఉందని రోజా ఆరోపించారు. అంతేకాకుండా ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం కోడెల శివప్రసాద్ పై తప్పుడు కేసులు పెట్టలేదని కోడెల నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఫిర్యాదు మేరకే కోడెల శివప్రసాద్ పై కేసులు నమోదయ్యాయని రోజా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.