మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి దిగుతున్న కెసిఆర్ పార్టీ…?

 వాస్తవం ప్రతినిధి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టి పార్టీని స్థాపించి చివరాకరికి తెలంగాణ రాష్ట్రాన్ని దక్కించుకున్నారు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనకై కేసీఆర్ చేసిన రాజకీయం మరియు ఉద్యమం ఎవరు కూడా మర్చిపోలేనిది. 2014 ఎన్నికల ముందు అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి సారి జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వం స్థాపించడం జరిగింది.

ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండో సారి కేసీఆర్ పార్టీ అద్భుతంగా గెలిచింది. దీంతో చాలామంది టిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోటీ చేయాలని అప్పట్లో అనేక కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల పక్క రాష్ట్రాలలో టిఆర్ఎస్ పార్టీని పోటీకి దింపితే ఖచ్చితంగా గెలవడం ఖాయం అని అప్పట్లో బలమైన మాటలు వినబడ్డాయి. కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికే టిఆర్ఎస్ పార్టీని పరిమితం చేశారు.

ఇటువంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ సరిహద్దు రాష్ట్ర మహారాష్ట్రలో మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని పోటీకి దింపాలని కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై పార్టీ నాయకులకు కూడా సూచించినట్లు కూడా టాక్ వినపడుతోంది. ఎందుకంటే గతంలో మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న నాందేడ్ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని ఆ ప్రాంత నేతలు ఉద్యమించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు టీఆర్ ఎస్ పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. నాందేడ్ – గడ్చిరోలి జిల్లాల్లోని తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలకు తెలంగాణకు ఎంతో అనుబంధం ఉంది. దీంతో మహారాష్ట్ర రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ పార్టీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు బలంగా తెలంగాణ రాజకీయాలు వినబడుతున్న టాక్.