వర్షాలు బాగా పడుతున్నాయి అంటున్న సీఎం జగన్..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వర్షపాతం కనీస స్థాయిలో కూడా పడకపోవడంతో ఏపీ రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అసలు రాయలసీమలో గత ప్రభుత్వంలో అసలు వర్షాలు పడకపోవడంతో చాలామంది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వలస వెళ్లిపోయారు. కాగా ప్రస్తుతం రాయలసీమలో వర్షాలు బాగా కురవడంపట్ల ముఖ్యమంత్రి జగన్ సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో వరదల వల్ల నష్టపోయినవారిని ఆదుకుంటామని ఆయన అన్నారు. నంద్యాలలో ఆయన వరదలపై సమీక్ష చేశారు. దేవుడి దయ వల్ల రాయలసీమలో వర్షాలు బాగా కురిసి వర్షపాతం సాధారణ స్థాయికి వచ్చిందన్నారు. నంద్యాల డివిజన్‌లో 17 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని తెలిపారు. భారీ వర్షాల వల్ల ఆర్‌ అండ్‌ బీ రోడ్లు, పీఆర్‌ రోడ్లు బాగా దెబ్బతిన్నాయని.. ఫలితంగా రూ. 784కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అంతేకాక 31వేల హెక్టార్లలో పంటనష్టం, 2వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. భవిష్యత్తులో కుందు నది పరివాహక ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో వరద నష్టం జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.