ఫోన్ నంబర్ ను 11 అంకెలుగా మార్చే యోచనలో ట్రాయ్‌

వాస్తవం ప్రతినిధి: ఇప్పుడు మన ఫోన్ నంబర్ లో 10 అంకెలుంటాయన్న సంగతి తెలిసిందే. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, 2050 నాటికి ఇండియాలో మొబైల్ నంబర్లకు ఏర్పడే డిమాండ్ ను అనుసరించి, 11 అంకెలను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. 10 అంకెల నంబర్లతో 250 కోట్ల మందికి సేవలందించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి మొబైల్ నంబర్లు కావాలంటే, 11 అంకెలు కావాల్సిందే.

ఇప్పటికే భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) 11 అంకెలను తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అతి త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. మరో 30 సంవత్సరాల తరువాత ఏర్పడే డిమాండ్ కు అనుగుణంగా ఓ అంకెను పెంచాలన్న నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.