చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ లో పోరాడి ఓడిన పి.వి.సింధు

వాస్తవం ప్రతినిధి: చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ లో భారత ఆశలు ఆవిరయ్యాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌ సాధించిన జోరులో పి.వి.సింధు చైనా ఓపెన్‌ టైటిల్‌కూడా సాధిస్తుందనుకున్న అభిమానుల ఆశలకు గండిపడింది. గురు వారం ఉత్కంఠగా సాగిన జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో మూడు గేమ్‌ల పోరులో 21-12, 13-21, 19-21 స్కోరుతో థాయిలాండ్‌కు చెందిన పొర్నపవీ చోచువాంగ్‌ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌ను గెలిచిన సింధు రెండో గేమ్‌లో తేలికగా ఓడిపోయి, మూడో గేమ్‌లో కడదాకా పోరాడి 58 నిమిషాలలో ప్రత్యర్థికి తలొగ్గింది.

పొర్నపవీ చేతిలో సింధుకిది తొలి ఓటమి. అంతకుముందు మూడుసార్లు ఆమెపై సింధు విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధు ఆరంభంనుంచి ఆధిపత్యం చలాయించింది. సింధు 7-1 ఆధిక్యం సాధించినా విరామానికి ప్రత్యర్థి ఆ ఆధిక్యాన్ని 11-10కి తగ్గించింది. విరామానంతరం సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి మళ్లి 19-10 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.

ఆ తరువాత తొలి గేమ్‌ గెలుపు లాంఛనమే అయింది. రెండో గేమ్‌లో వ్యూహం మార్చిన పొర్నపవీ 5-1 ఆధిక్యం సాధించింది. అయితే సింధు అంతరాన్ని 7-9కి తగ్గించింది. థాయ్‌ క్రీడాకారిణి పట్టువీడక మళ్లి 15-7 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆపై గేమ్‌ను గెలుచుకుని పోరులో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో ఇరువురూ నువ్వానేనా అన్నట్టు పాయింట్లు సాధిస్తూ 6-6తో నిలిచారు. ఈ తరుణంలో సింధు 11-7తో ఆధిక్యం సాధించి మ్యాచ్‌ను గెలిచే స్థితిలో నిలిచింది. పొర్నపవీ సింధుకు సవాల్‌గా నిలిచి స్కోరును 15-19కు చేర్చింది. ఆపై వరుసగా ఆరు పాయింట్లు గెలిచి సింధు ఆశలకు గండికొట్టింది.