కోడెల శకం

వాస్తవం ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో కోడెల శివ ప్రసాద్ పేరు చెరగని ముద్ర వేసుకుంది.. ఆయన చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి…. అలాగే చేదు ఘటనలున్నాయి.. వైద్యుడిగా నాడి పట్టి నాయకుడయ్యాడు. ముప్పై ఏళ్లు అంచెలంచెలుగా ఎదిగారు. గడచిన ఐదేళ్లలో ఆయన పతనానికి బాటలు వేసుకున్నారు. కోడెల శకం హాట్ టాపిక్ గా మారింది.

పల్నాడు ప్రాంతానికి నరసరావు పేట ఒక ముఖ్య పట్టణం .. పగలు , ప్రతీకారాలకు పెట్టింది పేరు పల్నాడు ప్రాంతం. కోట ప్రాతంలో 1980 లో వైద్య వృత్తిని ప్రారంభించి ఆపరేషన్లు చేయడంలో దిట్టగా పేరు సాధించారు. అప్పటి యువ డాక్టర్ కోడెల శివప్రసాద్ . ఎన్ టి ఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో వైద్యులకు పెద్ద పీట దక్కింది. కాంగ్రెస్ పార్టీకి కాసు కుటుంబానికి కంచుకోట గా ఉన్న పేట లో కోడెల పాగా వేసారు. 1983 లో తొలి సారి ఎంఎల్ఏ గా గెలిచాడు. అప్పటి నుండి 1999 వరకు జరిగిన 5 సార్లు ఎన్నికలలో కోడెల విజయం సాధించారు. పొలిటికల్ పవర్ ఉన్నన్నాళ్లు జిల్లా ను ఒంటి చేత్తో ఏలారు. మంచికి మంచి , చెడుకు చెడు అన్ననినాదంతో నాడు రాజకీయ శత్రువులను ఎదురొడ్డారు. ప్రతి ఒక్కరిని ఏమ్మా అంటూ పేరుతో ఆఫ్యాయత గా పలకరించడం కోడెల గొప్పతనం . మందలించాలంటే ఒకే ఒక్క చూపుతో మాటతో చెమటలు పట్టించేవారు. ఏదైనా పని ఉందని వెళ్లే కార్యకర్తలకు తన మనిషి అనుకుంటే కచ్చితంగా చేసేపెట్టేవారు.. చూపులుకు సైలెంట్ గా ఉన్నా వైలెంట్ లో కూడా ఆరితేరినవాడే.. ప్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించడంలో ఆదిపత్యం కోసం విభజించి , పాలించి గ్రూపులు ప్రోత్సహించడంలోకూడా దిట్ట. జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ఏలు పెట్టి స్వంత పార్టీ నాయకుల మద్య వైరం తెచ్చుకున్న పరిస్థితులు అనేకమున్నాయి. తన స్వంత ఇంటిలోనే బాంబు లు పేలిన ఘటన ఆయన రాజకీయ జీవితంలో చెరగని చెడు ముద్ర వేసింది.. 1988 డిసెంబర్ 26 న విజయవాడ లో నిరహదరదీక్ష చేస్తున్న వంగవీటి మోహన్ రంగా హత్యకు గురయ్యారు. అప్పుడు హోం మంత్రిగా ఉన్నది కోడెలే.. రంగా హత్య కు కోడెల కారకులనే నేటికి విన్పిస్తోంది.. ఎన్ టిఆర్ , చంద్రబాబు ల మద్య అధికార పోరు సాగినపుడు ఎన్ టి ఆర్ పక్షాన నిలిచారు కోడెల. కోడెల ఎకచక్రాదిపత్యానికి నరసరావు పేట వాసులు 2004,2009 లో ఓటమి రుచిచూపించారు. అప్పుడు ఎలాగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కావడంతో కోడెల టెంపర్ తగ్గుముఖంపట్టింది.. చివరకు ఇక పేట లో తనకు స్థానంలేదని తెలిసి సత్తెనపల్లి వైపు అడుగులేసారు. చావుతప్పి కన్ను లొట్ట పోయినట్లు అతి స్వల్ప మెజార్టీతో అంబటి రాంబాబు పై 2014 లో కోడెల విజయం సాధించారు. మంత్రి కావాలని మోజుపడ్డప్పటికి సీనియర్ స్పీడ్ కు కళ్లెం వేసేందుకు చంద్రబాబు కోడెలను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. నవ్యాంద్ర తొలి స్పీకర్ గా మంచి పేరు తెచ్చుకోవాల్సి ఉండగా మాయని మరక వేసుకున్నారు. వైసిపి సభ్యులు రాజీనామా చేయకుండా టిడిపిలోకి పార్టీపిరాయింపులు చేస్తే వారి పూ వేటు వేయకుండా చట్టాలను అపహాస్యం చేసారు. ఇక స్పీకర్ అధికారం అడ్డుపెట్టుకుని అడ్డగోలు అక్రమాలు చేసారనేది మిలియన్ డాలర్ల సమాధానం. కోడెల కూతురు, కొడుకు ఇరువురు రెండు బ్యాచ్ లుగా విడిపోయి పోటా పోటిగా వసూళ్లకు తెరదీసారు. కె ట్యాక్సు పేరుతో బెంబేలెత్తించారు. కేబుల్ వ్యాపారంలో అడుగు పెట్టి వేరెవ్వరిని ఎదగనీయలేదు. కూతురు పార్మసీ, వైద్య రంగాలనుండి వసూలు చేసారు. గుంటూరు గుంట గ్రౌండ్ లో దేవాదాయ స్థలం కాజేపి కాంప్లెక్సు కట్టడం, ద్విచక్రవాహాణాల డిస్ట్రిబ్యూషన్ లాంటి ఎన్నెన్నో చేసారు. ఇవే గడిచిన ఐదేళ్లలో కోడెల పరువును మంట కలిపాయి. ఇవన్నీ ఆయనకు తెలిసినా సక్రమ మార్గంలో కొడుకు కూతురును పెట్టలేకపోయి అభాసుపాలయ్యారని నానుడి. చివరకు అసెంబ్లీ పర్నీచర్ సామాగ్రిని సైతం అపహరించారని నిర్దారణ అయింది. మూడు పదులఏళ్లు రారాజు లాగా ఏలుబడి చేసి ఐదేళ్లలో పతనమయ్యారు.

2019 లో కోడెలకు సీటు ప్రకటించగానే సత్తెనపల్లి లో స్వంత పార్టీవాసులే నిరసనలు చేపట్టారు.. ఇదే కోడెల పై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం. సీటు దక్కినా 2019 లో ఓటమి పాలవడం , వైసిపి అధికారంలోకి రావడం ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేసింది. వరుస వెంబడి కేసులు పెట్టడం పరువు మంటకలిసింది. దీనికితోడు ఇంటిలో కొడుకు కూతుర్ల మద్య విభేదాల ను సరిచేయలేక నలిగి కుంగి కృషించిపోయారు.

పల్నాటి పులిగా పేరుగాంచిన కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. గుండె పోటు మరణమా, ఆత్మహత్యా, లేక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారో తెలియాల్సి ఉంటుంది. కోడెల జీవితం రాజకీయాల్లో ఒక పాఠం గా గుణపాఠం గా మిగలనుంది.

కోడెల చేసిన అనేక మంచి పనులు ఆధర్శంగా నిలుస్తాయి వాటిలో కోటప్ప కొండ డవలప్ మెంట్ ఒకటి.కోడెల శివప్రసాద్ కు కోటప్ప కొండకు విడదీయరాని బంధం ఉంది.. ఆయన ఏది తలపెట్టినా కోటప్పకొండ నుండే శ్రీకారం చుట్టేవారు. త్రికోటేశ్వరస్వామి ఆలయ రూపు రేఖలు మార్చి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత కోడెలకే దక్కుతుంది. శివరాత్రి వచ్చిందంటే చాలు ఈ శివయ్య అక్కడ వాలిపోతారు.

రాష్ట్ర విభజన సమయంలో సమైఖ్యాంద్ర కోసం కోడెల ఎన్నోపోరాటాలు చేసారు. అఖిలపక్షంతో కలసి గుంటూరు కేంద్రంగా ఆమరణ దీక్షలు చేసారు.

స్పీకర్ హోదా లో మహిళా సాధికారత పేరుతో కోడెల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా పార్లమెంట్ సదస్సు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.

సత్తెనపల్లి నియోజకవర్గంలో వావిలాల గోపాలక్రిష్ణయ్య పార్కు సమీపంలోని చెరువును అభివృద్ది చేసి భారీ ఎన్ టిఆర్ విగ్రహం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు.

మనిషి జీవితంలో ఆఖరి మజిలికి ఆరుడగులు జాగా లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలలో స్మశానాలను నిర్మించి చెరగని ముద్రవేసారు. ఇదే ఆదర్శంగా తీసుకుని రాష్ట్రమంతా అనుసరించారు. ఆత్మగౌరవం నినాదంతో ప్రజానీకానికి మేలు చేయాలన్న సంకల్పంతో స్వచ్చ భారత్ పేరుతో గ్రామ గ్రామాన మరుగుదొడ్ల నిర్మించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు.

ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రహదారుల నిర్మాణం, సాగునీటి సౌకర్యం, తాగునీటి సౌకర్యాలను కల్పించారు.

కోడెల ద్వారా మేలు పొందిన వారు ఆయన మంచి ని తలుచుకుంటారు.