జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం !

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ ప్రజలకు అవినీతి లేని ప్రభుత్వాన్ని అందించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కొత్తగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ ప్రజలకు, ప్రభుత్వానికి మాత్రమే కనెక్షన్ ఉండేలా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ సామాన్య ప్రజలకు కూడా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమాన్ని అందజేయాలనే సంకల్పంతో గ్రామ వాలంటరీ, గ్రామ సచివాలయం వంటి వ్యవస్థలను తీసుకు రావడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా జగన్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని దేవాలయాల పాలకమండళ్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాలకమండళ్లు, దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించింది. అంతేకాదు, పాలకమండళ్లలో మహిళలకు 50 శాతం పదవులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.