పార్టీ కార్యకర్తలు అస్సలు భయపడొద్దు..ధైర్యంగా ఉండండి: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ మద్దతుదారులతో ఫోన్లో మాట్లాడారు. వేరే గ్రామాల్లో తలదాచుకుంటున్న వారిని తిరిగి వారి గ్రామాల్లో చేర్చే కార్యక్రమానికి పిలుపునివ్వటం.. అది కాస్తా ఉద్రిక్తంగా మారటంతో.. పోలీసులు సైతం అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ లను హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ నేతల్ని బాబు ఇంటికి రాకుండా అడ్డుకున్నారు.

దాడుల భయంతో వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన టీడీపీ నేతలు.. కార్యకర్తల్ని ఆత్మకూరుకు చేర్చారు పోలీసులు. ఈ సందర్భంగా బాధితుల్లో ఒకరైన మాజీ సర్పంచ్ ఏసోబుతో చంద్రబాబు మాట్లాడారు. ఊళ్లో ఎలా ఉన్నారు? ఇళ్లు ఎలా ఉన్నాయి? సమస్యలేమైనా ఉన్నాయా? పోలాలకు వెళుతున్నారా? లాంటి ప్రశ్నలు వేసిన బాబుకు.. ఏసోబు సమాధానమిస్తూ.. గడిచిన మూడు నెలల్లో ఊళ్లో లేకపోవటం కారణంగా ఇళ్లు అన్ని పాడుపడిపోయాయని చెప్పారు. వాటిని తాము బాగు చేసుకుంటున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలు అస్సలు భయపడొద్దని.. ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ పూర్తి అండ ఉంటుందన్న మా ఇచ్చిన చంద్రబాబు.. తాను వచ్చే బుధవారం ఆత్మకూరుకు వస్తానని.. అందరిని కలుస్తానని మాట ఇచ్చారు.