చింతమనేని పై మరో కేసు నమోదు చేసిన పోలీసులు..!

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మహిళా అధికారుల పై చేయి చేసుకొని వార్తల్లో నిలిచిన చింతమనేని అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ భారీగా అవినీతి సొమ్ము చేసుకున్నారని కూడా అప్పట్లో అనేక ఆరోపణలు వినపడ్డాయి. అంతేకాకుండా దెందులూరు సొంత నియోజకవర్గంలో ఉన్న దళితులపై దారుణంగా దుర్భాషలాడి ఎన్నికల ప్రచారంలో సంచలనంగా మారిన చింతమనేని ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయి ఇంటికే పరిమితమైన చింతమనేని ఇటీవల పెదవేగి మండలం నికి చెందిన దళితులపై దుర్భాషలాడుతూ దాడులకు పాల్పడే విధంగా వ్యవహరించడంతో చింతమనేని పై కేసు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు చింతమనేని.

ఇటువంటి నేపథ్యంలో తాజాగా చింతమనేని ప్రభాకర్ పై మరో ఫిర్యాదు వచ్చింది. గతంలో తనను, తన కుటుంబ సభ్యులను చింతమనేని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని, ఆయన అనుచరులతో బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదులు చేసినా తగిన న్యాయం జరగలేదని పెదపాడు మండలం వడ్డిగూడెంకు చెందిన రామరాజు ఫిర్యాదు చేశారు. కాగా చింతమనేనిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.